జహీరాబాద్, ఏప్రిల్ 15 : పర్యాటక ప్రాంతంగా జహీరాబాద్ అభివృద్ధి చెంది పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. నియోజకవర్గంలో కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం, సిద్ధివినాయక దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఝరాసంగంలో ఉన్న కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతాది. ఈ ఆలయానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు రావడం విశేషం. సిద్ధివినాయక మందిరం న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారు బీదర్- జహీరాబాద్ రహదారిపై ఉంటుంది. ఈ మందిరానికి కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో పాటు పలు జిల్లాలకు చెందిన భక్తులు నిత్యం వస్తుంటారు. కేతకీ మందిరం హైదరాబాద్కు 115 కి.మీ ఉండగా జహీరాబాద్ పట్టణానికి 15కి.మీ దూరంలో ఉంటుంది. సిద్ధివినాయక స్వామి మందిరం హైదరాబాద్ నుంచి 114 కి.మీ ఉండగా జహీరాబాద్ పట్టణం దాటి 12 కి.మీలు వెళ్తే జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ఆలయ ముఖద్వారం కనిపిస్తది. అక్కడి నుంచి కిలో మీటరు వెళ్లగానే మందిరం ఉంటుంది. వేసవికాలం కావడంతో భక్తులు దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు. ఈ మందిరాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడంతో ప్రతి రోజు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
దక్షణ కాశీగా పేరొందిన కేతకీ సంగమేశ్వర దేవాలయానికి ప్రతి రోజు వందలాది మంది భక్తులు వచ్చి స్వామి వారి దర్శించుకుంటారు. భక్తులు అక్కడ ఉం డేందుకు గదులు అద్దెకు ఇస్తారు. ప్రతి రోజు అన్నదానం ఉంటుంది. జహీరాబాద్ నుంచి ఝరాసంగం వరకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. హైదరాబాద్ నుం చి వచ్చే భక్తులు జహీరాబాద్ వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో ఝరాసంగానికి చేరుకోవచ్చు. రేజింతల్ సిద్ధివినాయక దేవాలయానికి జహీరాబాద్ బస్టాండ్ నుంచి బీదర్ వైపు వెళ్లె బస్సుల్లో వెళ్లోచ్చు.