Land Registrations | మునిపల్లి, ఫిబ్రవరి 28 : గత ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిత్యం ఏదో సమస్యతో భూముల అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇబ్బందులకు గురి కాక తప్పడం లేదు. మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్ కార్యాయలంలో రిజిస్ట్రేషన్లు చేసే కంప్యూటర్ ఆపరేటర్ సెలవుపై ఉంటే చాలు ఆ రోజు భూముల రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు తప్ప మరో వ్యక్తిని ఏర్పాటు చేయకుండా అధికారులు ఇటు రైతులను, అటు భూ కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
గత సోమవారం నుంచి నేటి వరకు మునిపల్లి మండలంలో ఒక్క రిజిస్ట్రేషన్ చేయలేదు అంటేనే మునిపల్లి మండలంలో ఎంత మంచిగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో అర్థం అవుతుంది. మునిపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాయలంలో రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగకపోయినా ఉన్నత అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంపై పలువురు భూములు అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉన్నతాధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రమైన మునిపల్లిలో నేడైనా రిజిస్ట్రేషన్లు ఉంటాయా ఉండవా అని ఇటు రైతులు,ఆటు కొనుగోలు వ్యాపారస్తులు ఎదురు చూస్తున్నారు. నిత్యం భూములు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు. డేట్స్ మార్చుకుంటున్నారు తప్ప భూములు రిజిస్ట్రేషన్లు జరగడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సాఫీగా కొనసాగుతుంటే మునిపల్లి మండలంలో నిత్యం ఏదో ఓ సమస్య ఉందంటూ రిజిస్ట్రేషన్లు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో అని మునిపల్లి ఉప తహసీల్దార్ కృపనాందాన్ని వివరణ కోరగా ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీలో భాగంగా గురువారం వరకు రిజిస్ట్రేషన్లు చేయలేకపోయామని.. శుక్రవారం సైతం రిజిస్ట్రేషన్లు బంద్ ఉన్నాయని.. శనివారం రిజిస్ట్రేషన్లు చేసేందుకు ధరణి కంప్యూటర్ ఆపరేటర్ వస్తాడా లేదా అనే విషయం తెలుసుకునేందుకు కంప్యూటర్ ఆపరేటర్‌కు ఫోన్ చేస్తే ఆపరేటర్ స్పందించడం లేదని మునిపల్లి ఉప తహసీల్దార్ వివరణ ఇచ్చారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మునిపల్లి మండలంలో నిత్యం భూముల అమ్మకాల, కొనుగోలు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.