మునిపల్లి, ఆగస్టు 30 : రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రినా..? అంత మంత్రులదే హవా అని విమర్శలు రాష్ట్రంలో కోడైకొస్తున్నాయి.. రాష్ట్రాన్ని పాలించే సోయి లేక ఎవరికి వారే ముఖ్యమంత్రులం అన్నట్లు వ్యవహరించడంతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాక పోవడంతో రాష్టం అన్ని రంగాల్లో వెనుకబడిందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. శనివారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో గల శ్రీ సాయి గార్డెన్లో మునిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరో ఎవరికి వారే ముఖ్యమంత్రలం అన్నట్లు వ్యవహరించడంతోనే అభివృద్ధికి దూరంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెంప్ప చెల్లుమానేలా త్వరలో జరిగే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఎన్నడు లేని విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు సోయిలేని సర్కారుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు యూరియా అందించడంలో పూర్తి విఫలమైందని ప్రభుత్వ తీరుపై అసహన వ్యక్తం చేశారు. రైతులను అరిగోష పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు. రాష్టంలో రైతులు కాంగ్రెస్ పార్టీ తీరును గమనిస్తున్నట్లు తెలిపారు. రైతుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచివి కాదని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ రాజకీయ పార్టీలైనా పాతాళానికి పోవడం పక్క అన్నారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో సర్కార్ పట్టి పట్టినట్లు వ్యవహరించడం సర్కార్ చేతగానితనం అని విమర్శించారు. రైతులు బాగుంటేనే రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయి అన్న విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలన్నారు.
ఆందోల్ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించిన దామోదర్ రాజనర్సింహ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే దర్శనం ఇస్తుందని క్రాంతి కిరణ్ మంత్రి దామోదర్ రాజనర్సిహపై వవిమర్శల వర్షం కురిపించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ నేటికీ ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది లేదన్నారు. గ్రామాల్లో మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి తప్ప మంత్రి చేసిన అభివృద్ధి గోరంత కనిపించడం లేదని విమర్శించారు. ఆందోల్ ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచి.. మంత్రి అయ్యాక నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలు లేవన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెంప దెబ్బ కొట్టినట్లు బుద్ధి చెప్పాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓటు అడిగేందుకు వస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అరచకాలను గ్రామాల్లో ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన (420) హామీలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారాలు నిర్వహిస్తూ గ్రామాల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలని నాయకులు నడుము బిగించి ముందుకు వెళ్ళలన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అందరు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా మీ అన్న క్రాంతన్న ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మంతురి శశికుమార్, మాజీ ఎంపీపీ చంద్రయ్య, మాజీ సర్పంచులు విశ్వనాథంపాటిల్, రమేష్,శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షులు మౌలానా, సీనియర్ నాయకులు శివశంకర్, కుత్బుద్దీన్, భాస్కర్, వెంకటేశం, పాండు, పరశురాం గౌడ్, విట్టల్, సుల్తాన్, హఫీజ్, దత్తు తదితరులు ఉన్నారు.