Farmers Passbooks | అందోల్, మే 27: వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులకు విత్తనాల కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో కనుమరుగైన పాసుబుక్కుల క్యూలైన్లు మళ్లీ ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి కష్టాలు ఉంటే సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క వడ్లు వర్షానికి తడిసి రైస్ మిల్లర్లకు వెళ్లకముందే మొలకెత్తుతుండగా.. మరో పక్క జిలుగు విత్తనాల కొరతతో రైతులు పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్లో పెట్టి బారులు తీరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం నుండి జిలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కొసం తమ పట్టా పాస్ బుక్‌లను క్యూ లైన్లో పెట్టి కార్యాలయం వద్ద గంటలకొద్ది వేచి ఉన్నారు. సోమవారం నుండి సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తామని.. గత రెండు రోజుల నుంచి అధికారులు ప్రకటిస్తుండడంతో సోమవారం ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ కార్యాలయం వద్ద టోకెన్లు అందజేసేందుకు సరైన ఏర్పాటు లేకపోవడంతో ఇలా పాస్‌బుక్కులను క్యూ లైన్ లో పెట్టారు.
ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. జిలుగు విత్తనాలను అధికారులు ఎలాంటి సబ్సిడీ లేకుండా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన సంవత్సరం ప్రభుత్వం జిలుగు విత్తనాలను ఒక బ్యాగ్‌కు రూ.1,140 ఉంటే ఈ సంవత్సరం రూ.2,137.50 రూపాయలకు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
అంతేకాకుండా ఒక ఎకరాకు ఒక బ్యాగు జిలుగు విత్తనాలను గత సంవత్సరం సబ్సిడీ కింద పంపిణి చేస్తే.. ఈ యేడు రెండున్నర ఎకరాలకు ఒక బ్యాగు మాత్రమే అధికారులు పంపిణీ చేస్తున్నారని రైతులు వాపోయారు.