Dutta Jayanthi | ఝరాసంగం, డిసెంబర్ 07 : సంగాజిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం శనివారం రాత్రి దత్త జయంతి ముగింపు సందర్భంగా ఆది దంపతులైన శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ పరిసరాలు ఓం నమ :శ్శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమోగింది.
వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆది దంపతుల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా, ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్, పార్వతి పరమేశ్వరులకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఆలయ అర్చకులు జీలకర్రబెల్లం, కన్యాదాన తంతు నిర్వహించారు. వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి మెడలో పరమేశ్వరుడు మాంగల్యధారణ చేశారు. వైదిక పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. జహీరాబాద్, బీదర్, ఝరాసంగం, రాయికోడ్, మొగుడంపల్లి, నారాయణఖేడ్, భక్తులు కళ్యాణానికి హాజరయ్యారు. శనివారం అర్ధరాత్రి వరకు భజన సంకీర్తనలు కొనసాగాయి. గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్సవాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు