Actress Pragathi | టాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్రీడా రంగంలో అద్భుతమైన ఘనత సాధించారు. ఫిట్‌నెస్‌కు స్ఫూర్తిగా నిలిచే ఈ నటి టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని భారతదేశం తరపున నాలుగు పతకాలు గెలుచుకున్నారు. ప్రగతి తన అద్భుతమైన ప్రదర్శనతో డెడ్ లిఫ్ట్‌లో స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) సాధించారు. దీంతో పాటు ఓవరాల్ విభాగంలో రజత పతకం (సిల్వర్ మెడల్) గెలుచుకున్నారు. అలాగే, బెంచ్ ప్రెస్ మరియు స్క్వాట్ లిఫ్టింగ్‌లో కూడా ఆమె మరో రెండు రజత పతకాలు సాధించి దేశానికి, తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారు.
49 ఏళ్ల వయసులో కూడా నటన వృత్తికి అదనంగా పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుని, ఈ అంతర్జాతీయ విజయం సాధించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ శుభవార్తను ప్రగతి స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆమె విజయాలపై టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.