కంగ్టి, జూన్ 1: రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్విచక్ర, నాల్గు చక్రవాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంవత్సరంలో 6 నెలలు రోడ్డుపై ధాన్యపు కుప్పలు వేయడంతో ప్రయాణీకులకు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రివేళలో ప్రయాణం నరకంగా మారుతుందని తడ్కల్, కంగ్టి, జమ్గి(కె), జమ్గి(బి), చాప్టా(కె) తదితర గ్రామాలకు చెందిన ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యాన్ని ఆరవేసే క్రమంలో రైతులు ధాన్యం గుండా పెద్దరాళ్లు పెట్టడంతో కార్లకు తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహన దారులు రైతులు వేసిన కుప్పలు సరిగ్గా కనబడకపోవడంతో నేరుగా కుప్పలు మీదుగా వెళ్లి తీవ్రగాయాలు జరిగిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో భాగంగా రైతులకు తమ పంటపొలాల్లో ధాన్యాన్ని ఆరబోసేందుకు కట్టల నిర్మాణం కోసం పలుపథకాలు ఉన్నాయని, దీనిని సద్వినియోగం చేసుకుని తమ పంటపొలాల్లోనే కట్టలను నిర్మించుకోవాలని కోరారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ధాన్యపు కుప్పలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.