చుట్టూ అడవులు పచ్చని చెట్ల మధ్యన వెలసిన పలుగు పోచమ్మ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. నిత్యం వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు సమర్పించే కానుకలు టికెట్ల రూపంలో వసూలు చేసే డబ్బులు జమ అవుతున్న భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల ఆలయ పాలక మండలి కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు అపరిశుభ్రత వాతావరణంలో అమ్మవారిని వేడుకోవలసిన దుస్థితి నెలకొంది.
హత్నూర, జూలై 28: సంగారెడ్డి జిల్లా హత్నూర (Hathnoora) మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులోని పలుగు మీది నల్ల పోచమ్మ దేవాలయానికి (Nalla Pochamma Temple) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయానికి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్ నగర భక్తులు ఎంతోమంది నిత్యం అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి ఆలయం వద్ద కోరిన కోరికలు తీర్చాలని వేడుకునే భక్తులు కోరికలు తీరిన వెంటనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయానికి వచ్చే భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి డబ్బులు హుండీలో వేయడంతో పాటు పలు వస్తువుల కోసం ఆలయ సిబ్బంది వసూలు చేసే టికెట్లకు సైతం డబ్బులు వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆలయం వద్ద భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల దేవాదాయశాఖ అధికారులు, పాలకమండలి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆలయ పరిసర ప్రాంతం అపరిశుభ్రత వాతావరణ నెలకొంది.
ఆలయం వద్ద ఉన్న మంచినీటి ట్యాంకులు అపరిశుభ్రత వాతావరణం లో దర్శనమిస్తున్నాయి. ట్యాంకుల చుట్టూ మురికి నీరు చేరి మురికి కూపాలుగా మారడంతో ఈగలు, దోమలతో పాటు పందులు స్వైర విహారం చేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. క్రమం తప్పకుండా మంచినిటి ట్యాంకులు శుభ్రపర్చాల్సి ఉండగా నెలల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో ట్యాంకుల్లో కలుషిత నీరు వస్తుందని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మహిళా భక్తులు మల,మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అయితే చాలు విద్యుత్ దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో ఆలయ పరిసర ప్రాంతం చీకటిగా ఉంటుందని అక్కడ అమ్మవారి వద్ద నిద్ర చేయడానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా ఆలయానికి వచ్చే భక్తులు వాహనాలు నిలుపుకోవడానికి సరైన స్థలం లేక రోడ్డుపై నిలుపుతుందటంతో పార్కింగ్ సమస్య నెలకొని తరచూ భక్తుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుగు పోచమ్మ ఆలయం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినప్పటికీ అక్కడ పరిస్థితులు మాత్రం భక్తులకు ఇబ్బందిగా తయారయ్యాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి పుష్కలంగా నిధులు సమకూరుతున్న వాటిని సక్రమంగా వినియోగించకపోవడంతో సమస్యల వలయంలో అమ్మవారి ఆలయం నెలకొందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖగా అధికారులు కానీ పాలకమండలి సభ్యులు కానీ పట్టించుకోని ఆలయం వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు వేడుకుంటున్నారు.