రాయపోల్ సెప్టెంబర్ 05 : వాటర్ హీటర్ ముట్టుకొని ఓ బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలో గురువారం రాత్రి సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దొమ్మాట గ్రామానికి చెందిన గడ్డమీది కరుణాకర్‌కు మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామానికి చెందిన కీర్తనతో 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కరుణాకర్, కీర్తన దంపతులు అత్తగారి ఇంటి వద్ద కొన్ని రోజుల నుంచి మాచిన్ పల్లిలో ఉంటున్నారు. కరుణాకర్ ఓ కంపెనీలోపనిచేస్తున్నాడు.
కర్ణాకర్ భార్య, కీర్తన ఇంటి వద్ద కిరాణా షాపును నడుపుతున్నది. గురువారం సాయంత్రం ఇంటి వద్ద వాటర్ హీటర్ పెట్టారు. అయితే చిన్న కుమారుడు నోయల్ (4) ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి వాటర్ హీటర్ కు తగిలి మృతి చెందాడు. బాలుడు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకు తల్లితో ఆటాడుకున్న చిన్నారి మృతి చెందడంతో మాచినపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.