కంది, మే 22 : అక్రమ నల్లమట్టి దందాకు అలుపు..అదుపు లేకుండా పోతుంది. కంది మండల పరిధిలోని కౌలంపేట్ ఊదం చెరువును ఊడ్చుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఊదం చెరువులోని నల్లమట్టిని అక్రమార్కులు అర్ధరాత్రిళ్లు తరలించుకుపోతున్నారు. చెరువులో సుమారు ఏకరానికి పైగా జేసీబీలతో మట్టిని తరలించడంతో చెరువంతా గుంతలమయంగా మారింది. అధికార పార్టీ నేతల అండదండలతోనే నల్లమట్టిని అక్రమంగా ఇటుక బట్టిలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఆరు లైన్ల జాతీయ రహదారి వెడల్పు పనుల్లో భాగంగా మొరం మట్టి కోసం నేషనల్ హైవే అథారిటి అధికారులు అన్ని అనుమతులతో ఊదం చెరువులోని మొరం మట్టిని వాడుకుంటున్నారు. ఇదే అనువుగా భావించిన కొందరూ అక్రమార్కులు చెరువులోని నల్లమట్టిని తరలించినా అది జాతీయ రహదారి పనుల కోసమేకావచ్చని అందరూ అనుకుంటారని స్కేచ్చు వేశారు. రహదారి పనుల కోసం జరుపుతున్న తవ్వకాల వెనకాలే అక్రమార్కులు అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో నల్లమట్టిని టిప్పర్లలో తరలించుకుపోతున్నారు. తాము అధికార పార్టీకి చెందిన వారిమి తమను అడ్డుకునేదేవరూ అనే ధీమాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
సంబంధిత అధికారులు ఊదం చెరువుపై ప్రత్యేక దృష్టి పెట్టి మట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.అయితే అక్రమార్కుల నల్లమట్టి తరలింపుకు సహకరించకపోవడంతో నేషనల్ హైవే అథారిటి అధికారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని భయటకు రాకుండా ఓ నాయకుడు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారితో క్షేమపాణ చెప్పించి కాంప్రమైజ్ చేపించినట్లు సమాచారం. కాగా, ఇదే విషయంపై తహసీల్ధార్ ఆశాజ్యోతి స్పందించారు. కౌలంపేట్ ఊదం చెరువులో అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. వారిపై చర్యలు తీసుకునేలా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాం. చెరువుల్లో మట్టిని తరలిస్తే ఎంతటి వారినైనా ఊపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు.