జహీరాబాద్ , మే 1 : త్యాగాల కొలిమిలో నుండి ఎర్రజెండా పుట్టిందని, పోరాటం ద్వారానే హక్కులు సాధించబడతాయని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీరం మల్లేష్ అన్నారు. మేడే సందర్భంగా గురువారం మహీంద్రా పరిశ్రమ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం శ్రామిక్ భవన్ వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చికాగో నగరంలో 8గంటల పనిదినాల కోసం రక్తం చిందించి ప్రాణాలర్పించిన మహత్తర కార్మిక పోరాటం మేడేగా ప్రసిద్ధికెక్కిందన్నారు.
అదే స్ఫూర్తితో కార్మిక వర్గం ఎన్నో హక్కులు సాధించుకుందన్నారు. మోదీ అధికారం చేపట్టిన నుండి చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్భర పరస్థితులను సృష్టించారు. అత్యంత హేయమైన పద్దతులకు పాల్పడుతూ కార్మికుల చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు.తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు.
అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తెస్తుందని వీటితో పెద్ద ఎత్తున కార్మికులకు నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు వివిధ పరిశ్రమలు, మున్సిపల్ తదితర స్థలాల్లో సీఐటీయూ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మహిపాల్, వివిధ పరిశ్రమలు, రంగాల సీఐటీయూ నాయకులూ కనకరెడ్డి, సందీప్ రెడ్డి, గణేష్, నరేష్, బక్కన్న, యశోదమ్మ, చంటి, సంజీవ్, తదితరులున్నారు.