సంగారెడ్డి: రాష్ట్రంలో ఏటీఎంలలో వరుస చోరీలు (ATM Robbery) జరుగుతున్నాయి. రక్షణ లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. సోమవారం అర్ధరాత్రి బొల్లారంలోని ఏటీఎంనే ధ్వంసం చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మే 30న హుజూర్‌నగర్‌లోని లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.20 లక్షలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో ఫార్చునర్ కారులో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి.. కటింగ్ మిషన్‌తో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న నగదు అపహరించారు. పోతూపోతూ ఏటీఎం మెషిన్‌ను కాల్చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే దొంగతనం చేయడం గమనార్హం.