Zaheerabad | జహీరాబాద్, మే15: బైక్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తల్లితో వాగ్వాదం అనంతరం పరిగెత్తుకెళ్లి గ్రామ శివార్లలో ఉన్న బావిలో దూకాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం మామిడ్గి గ్రామానికి చెందిన మొగులమ్మ కుమారుడు సాల్మన్. కొంతకాలంగా తనకు బైక్ కావాలని సాల్మన్ వాళ్ల అమ్మను అడుగుతున్నాడు. కానీ ఒప్పుకోలేదు. బైక్ కొనివ్వాలని ఎంతగా బతిమిలాడినా మొగులమ్మ వినలేదు. బైక్ కొనడం కుదరదని తేల్చిచెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన సాల్మన్.. బావిలో దూకి సచ్చిపోతా అని బెదిరించాడు.
కుమారుడి బెదిరింపులను లైట్ తీసుకున్న మొగులమ్మ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టుదలకు పోయిన సాల్మన్ వెంటనే ఊరవతలకు పరుగెత్తుకెళ్లి.. అక్కడ బావిలో దూకాడు. బావిలో దూకి.. అందులో ఉన్న మోటార్ పైపును పట్టుకుని అలాగే ఉండిపోయాడు. బైక్ కొనిస్తేనే బయటకు వస్తానని మారాం చేశాడు. దీంతో తన కుమారుడు చేసిన ఘనకార్యాన్ని స్థానికులకు చెప్పి సాయం చేయాలని మొగులమ్మ కోరింది. దీంతో స్పందించిన స్థానికులు ఒక తాడు సాయంతో సాల్మన్‌ను పైకి తీశారు.