Veer Soren : జార్ఖండ్ (Jharkhand) మాజీ సీఎం చంపాయ్ సోరెన్ (Champai Soren) మనవడు వీర్ సోరెన్ (Veer Soren) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మనాలీ (Manali) లోని ఓ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీర్ సోరెన్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. వీర్ సోరెన్ మరణవార్త తెలిసిన వెంటనే చంపాయ్ సోరెన్, అతని ముగ్గురు కుమారులు ఢిల్లీకి పయనమయ్యారు.
చంపాయ్ సోరెన్ రెండో కుమారుడైన బాబూలాల్ సోరెన్ కొడుకు వీర్ సోరెన్ (19) ఈ నెల 22న తన స్నేహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లాడు. ఆరోజు రాత్రి సిమ్సాలోని ఓ హోటల్లో వారు బసచేశారు. ఫిబ్రవరి 23న సోలాంగ్ వ్యాలీ, హమ్తా పాస్ సమీపంలోని సేథన్ గ్రామాన్ని వారు సందర్శించారు. సాయంత్రం హోటల్‌కు చేరుకున్న తర్వాత వీర్ సోరెన్ అస్వస్థతకు గురయ్యాడు.
ఫిబ్రవరి 24న ట్రిప్ పూర్తిచేసుకుని మధ్యాహ్నానికి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీర్ సోరెన్ తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. దాంతో స్నేహితులు అతనికి మెడిసిన్ ఇచ్చారు. దాంతో నొప్పి తగ్గి నిద్రలోకి జారుకున్నాడు. అయితే మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గట్టిగా కేకవేశాడు. స్నేహితులు వెళ్లి చూసేసరికి చప్పుడు లేకుండా పడుకుని ఉన్నాడు.
అయితే రాత్రి అయ్యేసరికి అతని ఆరోగ్యపరిస్థితి క్షీణించింది. దాంతో స్నేహితులు హుటాహుటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుండగా అతడి నోటి నుంచి నురుగలు కూడా వచ్చాయి. ఆస్పత్రికి చేరుకోగానే వైద్యులు గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని చూసి సీపీఆర్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో అతడు మరణించినట్లుగా ధృవీకరించారు.
దాంతో వీర్ సోరెన్ స్నేహితులు చంపాయ్ సోరెన్ కుటుంబానికి సమాచారం అందించారు. దాంతో చంపాయ్ సోరెన్, అతని కుమారుడు సైమల్ సోరెన్, బాబూలాల్ సోరెన్, బబ్లూ సోరెన్ ఢిల్లీకి బయలుదేరారు. తన మనవడి మరణానికి సంబంధించిన విషయాన్ని చంపాయ్ సోరెన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.