ఖమ్మం రూరల్, ఆగస్టు 15 : చోరీ చేసేందుకు అర్ధరాత్రి ఓ దాబాలో దూరిన వ్యక్తులు పూటుగా తాగి తెల్లవారుజామున దాబా యజమానికి చిక్కిన ఘటన శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం కురవి ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఓ దాబాలోకి అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి లోపలికి దూరారు. సుమారు రూ.1.50 లక్షల విలువ గల సామగ్రిని తరలించారు. చోరీ కోసం వచ్చిన దొంగలకు అక్కడ మద్యం సీసాలు కనిపించడంతో వచ్చిన పని అయిపోయిందని అనుకున్నారో ఏమో కానీ ఫుల్లుగా తాగేశారు. ఉదయం 8:30 అయినప్పటికీ లోపలనే ఉండిపోయారు. ఉదయం సమయంలో దాబా యజమాని వెంపాటి రమేశ్ దాబా వద్దకు వచ్చి చూసే సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. దాబా యజమానిపై దాడికి దిగే ప్రయత్నం చేయడంతో బయటకు వచ్చిన యజమాని వెంటనే ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని దొంగతనంపై ఆరా తీశారు. నిందితుల్లో ఇద్దరు ఖమ్మం నగరానికి చెందిన వారు కాగా, మరో వ్యక్తి దానవాయిగూడ కు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది.