Vande Mataram : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల సందర్భంగా జరిగిన ఒక ఘటనపై స్వల్ప వివాదం మొదలైంది. వందేమాతరం గేయానికి ఇటీవల పూర్తిస్థాయి జాతీయ గేయంగా గౌరవం దక్కింది. జాతీయ గీతానికి ఉన్న గౌరవాన్నే కేంద్రం కల్పించింది. దీంతో తాజా స్వాతంత్య్ర దిన వేడుకల్లో వందేమాతరం ఆలపించడం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన వేడుకల సందర్భంగా కూడా వందేమాతరాన్ని నిర్వాహకులు ప్లే చేశారు.
అది కూడా పూర్తి గేయాన్ని. అయితే, ఈ గేయం ప్లే అవుతుండగా సోనియా, రాహుల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వందేమాతరం ప్లే అవుతున్నప్పుడు సోనియా, రాహుల్ కాస్త అటూ, ఇటూ చూడటం చేశారు. దీంతో పూర్తి వందేమాతరం గేయం ప్లే అవ్వకుండా ఆపేయాలంటూ సూచించారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పక్కనే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. సోనియా, ఖర్గే కాస్సేపు ఏదో చర్చించుకుంటున్నట్లు అక్కడి వీడియోలో కనిపించింది. దీంతో వారు వందేమాతరాన్ని ఆపేయమన్నారంటూ ప్రచారం జరగడంతో ఆ పార్టీ స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఖర్గే చాలాసేపు నిలబడే ఉన్నారు.
పెద్ద వయసు కావడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారని, అంతేకానీ.. ఆ గేయాన్ని ఆపాలని చెప్పలదేని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రచారానికి తెరపడింది. వందేమాతరం పూర్తి గేయాన్ని ఈ రోజు అధికారికంగా ఢిల్లీలోని ఎర్రకోటలో ప్లే చేశారు. మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత ఆర్మీ తమ బ్యాండ్‌తో వందేమాతరం గేయాన్ని ఆలపించింది. ఈ గేయానికి జాతీయ గీతం తరహా హోదా దక్కిన తర్వాత తొలిసారి దేశమంతటా పూర్తి వందేమాతరాన్ని భారతీయులు ఆలపించారు.