ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 25 : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి, స్పష్టమైన మార్పు తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్ ఆధారంగా జిల్లాలో గుర్తించిన ముఖ్యమైన 30 ప్రమాద ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు భద్రతా పనులలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీలోని వెంకటగిరి క్రాస్ రోడ్, కోదాడ క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్డు, ఏదులాపురం జంక్షన్ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనితతో కలిసి కలెక్టర్ రోడ్డు భద్రతా పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశమున్న 30 బ్లాక్ స్పాట్స్‌ను శాస్త్రీయంగా గుర్తించి, అక్కడ స్పీడ్ కంట్రోల్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌లు, పాదచారుల మార్గాలు, రోడ్ స్టడ్స్, క్యాట్ ఐస్, సోలార్ బ్లింకర్స్, క్రాష్ బారియర్స్, థర్మోప్లాస్టిక్ లైన్ మార్కింగ్ వంటి భద్రతా చర్యలను సమగ్రంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ప్రధాన జంక్షన్ల వద్ద రోడ్డుపై “గో స్లో” వైట్ పేయింట్ వేయడం, స్కూల్ జోన్ల వద్ద ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్లు సరిగ్గా నిర్మించడం వంటి చర్యలు ప్రజల్లో అప్రమత్తత పెంచుతాయని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డిటెక్షన్ సెంటర్ (ఐఆర్ఏడి) డేటాను సమీక్షించి, ప్రమాదాల ప్రధాన కారణాలను విశ్లేషించి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే 15 రోజుల్లోనే మార్పు కనిపించేలా అధికారులు పని చేయాలన్నారు. పనులు పూర్తి చేయడమే కాదు, నాణ్యతను కూడా నిర్ధారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, నూతన పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగాక స్పందించడం కంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది అన్నారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం, యువత స్పీడ్‌పై నియంత్రణ ఉండకపోవడం వలన డ్రైవింగ్ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. రోడ్డు భద్రత ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం తో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, ఖమ్మం నగర పాలక సంస్థ సహయ కమిషనర్ అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.