సంగారెడ్డి అర్బన్, జూలై 12 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి పట్టణం గణేష్‌నగర్‌కు చెందిన రవికిరణ్ కూతురైన తనిష్క(9) తన బాబాయి రామకృష్ణతో కలిసి పోతిరెడ్డిపల్లి నుంచి గణేష్‌నగర్‌కు వస్తున్న క్రమంలో.. కలెక్టరేట్ ముందు యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీ అదుపుతప్పి పడిపోయింది. వెనక కూర్చున్న తనిష్క రోడ్డుపై పడిపోవడంతో వెనకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు తనిష్క తలపై నుంచి వెళ్లడంతో స్పాట్లోనే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని తనిష్క కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
తనిష్క తండ్రి రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తనిష్క మృతితో తల్లిదండ్రుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి.