Assigned Land | జహీరాబాద్, మే 26 : గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గ్రామ పెద్దనే అక్రమాలకు తెరతీశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఓ పేద రైతుకు చెందిన ప్రభుత్వ అసైన్డ్ భూమిని, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తన కూతురి పేర అక్రమంగా బదలాయించుకున్నారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గంజోటి గ్రామంలో వెలుగుచూసింది. మాజీ జడ్పీటీసీ చంద్రప్ప ఆగడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గుంజేటి గ్రామానికి చెందిన లచ్చయ్య కుమారుడు నర్సిములు అనే పేద రైతుకు గ్రామంలోని సర్వే నంబర్ 5/25/1 లో 1 ఎకరం 26 గుంటల వ్యవసాయ భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే మాజీ జడ్పీటీసీ చంద్రప్ప న్యాల్కల్ రెవెన్యూ అధికారుల అండతో ఆ భూమిని అక్రమంగా తమ కూతురు బి. సంగీత పేరు మీదకు బదలాయించారు. ప్రస్తుతం ఆ భూమిని వారు ఆక్రమించుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మాజీ జడ్పీటీసీ గ్రామంలోని మరికొన్ని అసైన్డ్ భూములను సైతం కబ్జా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
దౌర్జన్యానికి దిగుతున్నారని కలెక్టర్ దృష్టికి..
చంద్రప్ప భూ అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే జడ్పీటీసీ చంద్రప్ప బూతులు తిడుతూ తీవ్ర దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు అంగబలం, భుజబలం ఉన్నాయని, ఎవరైనా ఎదురుతిరిగితే అంతుచూస్తామని దౌర్జన్యానికి దిగుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మాజీ జడ్పీటీసీ కూతురి పేర జరిగిన భూమి బదలాయింపు ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, ఆ భూమిని తిరిగి అసలు యజమాని అయిన నర్సింలుకు అప్పగించాలని లేదా ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
పేదవారి భూములను లాక్కుంటున్న మాజీ జడ్పీటీసీపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది గ్రామస్థులు సంతకాలు, వేలిముద్రలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఫిర్యాదుకు ఆధారంగా అసలు యజమాని నర్సిములు, మాజీ జడ్పీటీసీ కూతురు సంగీతల పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను జతచేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను జహీరాబాద్ ఆర్డీవో, న్యాల్కల్ తహసీల్దార్‌కు తదుపరి చర్యల నిమిత్తం పంపించారు.