సర్కారు దవాఖాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలతో పాటు గర్భిణుల ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. దీంతో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పడడంతో రోజురోజుకూ ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సంఖ్య పెరుగుతున్నది. మహిళలు ప్రసవాల కోసం సర్కారు దవాఖాలనే ఆశ్రయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఆయా ప్రభుత్వ దవాఖానల్లో డిసెంబర్ నెలలో జరిగిన ప్రసవాలు రాష్ట్రంలోనే అత్యధికంగా 86శాతం. దీంతో జిల్లా టాప్ స్థానంలో నిలిచింది.
సంగారెడ్డి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. డిసెంబర్లో అత్యధిక ప్రసవాలు సంగారెడ్డి జిల్లాలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేసుకున్న మహిళలకు కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగశిశువు జన్మిస్తే రూ.12వేలు ప్రభుత్వం అందజేస్తున్నది. గర్భిణీలు పరీక్షలు చేయించుకునేలా ప్రాథమిక, జిల్లా కేంద్ర దవాఖానల్లో చర్యలు తీసుకుంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లాలో దవాఖానాల్లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపర్చారు. ఆయా దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. కలెక్టర్ శరత్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ వైద్యసేవలపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య జిల్లాలో పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’లు అందజేయనున్నది.
86 శాతం ప్రసవాలతో సంగారెడ్డి టాప్
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబర్లో సంగారెడ్డి జిల్లాలో 86 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయి. సంగారెడ్డి మాతా శిశు సంరక్షణ కేంద్రంతోపాటు పీహెచ్‌సీల్లో మొత్తం 1787 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో 1532 ప్రసవాలు జరుగగా, 865 నార్మల్ డెలివరీలు అయినట్లు అధికాలు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1410 డెలివరీలు, మేలో 1375, జూన్‌లో 1333, జూలైలో 1246, ఆగస్టులో 1652, సెప్టెంబర్‌లో 1815, అక్టోబర్‌లో 1832, నవంబర్‌లో 1767 ప్రసవాలు జరిగినట్లు అధికారులు వివరించారు. డిసెబర్ నెలలో జరిగిన ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవటంపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్ శరత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
వ్యాక్సినేషన్లో సంగారెడ్డి ప్రథమస్థానం
కరోనా వ్యాక్సిన్ బూస్టర్‌డోస్‌లు ఇవ్వడంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. కరోనా నుంచి రక్షణకు ప్రభుత్వం బూస్టర్‌డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 12,77,038 మందికి బూస్టర్‌డోస్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, 13,32,786 మందికి వ్యాక్సిన్ వేశారు.