మునిపల్లి, డిసెంబర్ 19: పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి. నాలుగు రోజులుగా నీటి కోసం ప్రజలు, వేతనాల కోసం మిషన్ భగీరథ ఉద్యోగులు తిప్పలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు కోసం నానా అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్న 180 మంది ఉద్యోగులకు 15 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో మూడు రోజులుగా ఉద్యోగులు ధర్నాకు దిగారు.
మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలోని మిషన్ భగీరథ మెయిన్ ట్యాంకు వద్ద తాగునీళ్ల సరఫరా బంద్ చేసి ఉద్యోగులు ధర్నాకు దిగారు. దీంతో సంగారెడ్డి, పటాన్చెరు, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని ప్రజలకు తాగునీరు సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఉద్యోగులు చేపడుతున్న ధర్నా వద్దకు చేరుకొని, సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినా ఉద్యోగులు వినిపించుకోకుండా ధర్నా చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్లోని పలు గ్రామాలకు మునిపల్లి మండలంలోని బుధేరా గ్రామ శివారులోని మెయిన్ ట్యాంకు నుంచే నీటి సరఫరా అందుతుంది. అక్కడ సరఫరా నిలిపివేయడంతో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
మిషన్ భగీరథ ఉద్యోగులతో జిల్లా అధికారులు చర్చలు మొదలు పెట్టారు.15 నెలలకు సంబంధించి వేతనాలు ఇప్పుడు ఇవ్వలేం. ప్రభుత్వంతో మాట్లాడి ఆరు నెలల వేతనాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఉద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ, మిషన్ భగీరథ ఉద్యోగులు మాత్రం మొత్తం వేతనాలు చెల్లించే వరకు ధర్నా కొనసాగిస్తామని అధికారులకు తేల్చిచెప్పారు. మిషన్ భగీరథ ఉద్యోగులకు నచ్చజెప్పే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
గుమ్మడిదల, డిసెంబర్ 19: మిషన్ భగీరథ, పంచాయతీ పైప్లైన్ లీక్కావడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ పైప్లైన్, పంచాయతీకి చెందిన తాగునీటి పైప్లైన్ లీక్ కావడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ, పంచాయతీకి చెందిన తాగునీటి పైప్లైన్ లీక్కావడంతో స్థానికులు లీక్ అయిన నీటిని రోడ్లపైనే పట్టుకుంటున్నారు. మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాగు నీరు వృథాగా పోతుంది. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి గోసను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.