NIMZ | జహీరాబాద్, మార్చి 12 : ప్రాణాలు పోయినా సరే.. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగీ గ్రామంలోని రైతు వేదికలో నిమ్జ్ భూసేకరణ కోసం గ్రామసభ ఏర్పాటు చేశారు. నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ముందుకు వచ్చి భూములు ఇస్తే ప్రభుత్వ, పట్టా భూమికి ఎకరానికి రూ. 15 లక్షలు ఇస్తామని, ఇవ్వకుంటే జనరల్ అవార్డు ప్రకారం.. లేదా గత మూడు సంవత్సరాల భూముల రిజిస్ట్రేషన్ ప్రకారం పరిహారం చెల్లిస్తాను చెప్పారు. గత మూడేండ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, ఎలా పరిహారం చెల్లిస్తారని బాధిత రైతులు అధికారులను ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా సరే మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్జ్ కు ఇచ్చేది లేదన్నారు. భూములపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు.
తమ భూములను అమ్ముకునేందుకు అవకాశం లేకుండా చేయడంతో బ్యాంకులో రుణాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వెంటనే తమ భూములను అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. ఇంతలో కొందరు రైతులు భూములు ఇస్తామని చెప్పడంతో మరి కొంతమంది రైతులు ఎలా ఇస్తారంటూ గొడవకు దిగారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భూసేకరణ కోసం చేపట్టిన గ్రామసభ అర్ధాంతరంగా నిలిచిపోయింది. రైతుల గందరగోళ పరిస్థితుల్లో అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.