సంగారెడ్డి, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిం ది. నాలుగు రోజుల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సబ్ రిజిస్ట్రార్లు ఎన్నో రోజులుగా సాగిస్తున్న అవినీతి, అక్రమా ల బాగోతం బయటపడినట్లు సమాచారం. దాడులు ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు 84కు పైగా రిజిస్ట్రర్ డాక్యుమెంట్లను, రూ.6 లక్షలకు పైగా నగదును తమవెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు విచారణ కొనసాగుతుండంతో రిజిస్ట్రేషన్ అధికారుల్లో గుబులు నెలకొంది.
ఎక్కడ తమ అవినీతి బాగోతం బయటపడుతుందోనని ఆందోళన చెందుతున్నా రు. సంగారెడ్డి నుంచి బదిలీ అయిన అధికారులు కొత్త పోస్టు ల్లో చేరాల్సి ఉన్నప్పటికీ, చేరకుండా నిబంద్ధనలకు విరుద్ధ్దంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలా కన్వర్షన్లు, ప్రొహిబిటెడ్ భూములను రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల దాడులు జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు తాము చేసిన రిజిస్ట్రేషన్ల డాటాను కంప్యూటర్ల నుంచి మాయం చేసినట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ ఆఫీసులో నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు కంప్యూటర్ హార్ట్డ్రైవ్లను వెంట తీసుకెళ్లారు.
సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు సంగారెడ్డి, పటాన్చెరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రెండు కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ దాడిలో వెల్లడైనట్లు తెలిసింది. సంగారెడ్డి, పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్లు ఇటీవల బదిలీ అయ్యారు. వీరు ఈనెల 1వ తేదీలోపు తమ కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు చివరిరోజు నిబంధనలకు విరుద్ధ్దంగా పదులకొద్ది రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకు రానుండడం, భూముల విలువలను పెంచనుందన్న సమాచారంతో రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు ఈనెల 1వ తేదీ లోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ప్రారంభించా రు. దీంతో జూలై 29,30, 1వ తేదీల్లో ఎన్నడూ లేనివిధంగా రోజుకు 200 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. బదిలీపై వెళ్తున్న అధికారులు, సిబ్బంది డబ్బులకు ఆశపడి నిబంధనలకు ఉల్లంఘించి డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తున్నది. ఔటర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరిస్తామని ప్రభు త్వం ప్రకటించడంతో పటాన్చెరు,కొల్లూరు, తెల్లాపూర్, అమీన్‌పూర్‌లోని భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
దీంతో పెద్ద పెద్ద రియల్టర్లు తమ పరిధిలోని వివాదాస్పద భూములను, ప్రొహిబిటెడ్ భూములను నిబంధనలకు విరుద్ధ్దంగా రిజిస్ట్రేషన్లకు చేసుకునేందుకు సిద్ధ్దమయ్యారు. బదిలీలపై వెళ్తున్న అధికారులకు పెద్దఎత్తున డబ్బులు ఇవ్వడంతో ఆ అధికారులు నిబంధనలకు కాలరాసి ప్రభుత్వ, ప్రొహిబిటెడ్ భూములను రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు నాలా కన్వర్షన్లకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏసీబీ అధి కారులు తమ దాడుల్లో గుర్తించినట్లు తెలిసింది. ఇదే విషయమై సంగారెడ్డి నుంచి బదిలీ అయిన అధికారులను విచారిస్తున్నట్లు సమాచారం.
ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల నుంచి పెద్ద మొత్తంలో ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వెలుపల ఉన్న ప్రతి వాహనాన్ని ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రియల్టర్లు, బిల్డర్ల వాహనాలను తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు రూ.6 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఎంత డబ్బు స్వాధీనం చేసుకుంది తెలియరాలేదు.