హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తేతెలంగాణ): ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. గురువారం చేసిన ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఎన్ శ్రీధర్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆయనను తప్పించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పరిశ్రమలు, ఐటీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగిన ఎన్ శ్రీధర్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ట్రాన్స్ఫర్ చేశారు. రోజు తిరక్కముందే ఆయనను సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా తప్పించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శ్రీధర్ గనుల శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు.