తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఫేజ్1, ఫేజ్2ల్లో కలిపి 3500మందికి ఇండ్లను కేటాయించనున్నారు. శనివారం మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు పట్టాలు అందజేసి గృహప్రవేశాలు చేయించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ శరత్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పలువురు సంతోషంతో ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించి, సన్మానాలు చేశారు.
– పటాన్చెరు/రామచంద్రాపురం, సెప్టెంబర్ 1
పటాన్చెరు, సెప్టెంబర్ 1: కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం పంపిణీ చేయనున్నారు. ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరవుతున్నారు. లాటరీ పద్ధతిలో బ్లాకులు కేటాయిస్తారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్ల నుంచి తొలి విడుతలో ఎంపికైన 500మంది లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు సంతోషంతో ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించి, సన్మానాలు చేశారు. లక్షల రూపాయల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కొల్లూరులో 15వేల పైచిలుకు ఇండ్లను నిరుపేదలకు పంచనున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు మీ సొంతింటి కలను నిజం చేస్తున్నదన్నారు. రాజకీయాలకు అతీతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్నామన్నారు. అన్ని కంప్యూటర్లో పారదర్శకంగా తీసిన డ్రా ద్వారా ఇస్తున్నామన్నారు. శనివారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఇండ్ల పత్రాలు అందజేస్తామన్నారు. ఇల్లు తీసుకున్న వారు అమ్ముకునే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. పటాన్చెరు ప్రాంతానికి సంబంధించిన లబ్ధిదారులను పటాన్‌చెరులోని మైత్రి స్టేడియం నుంచి బస్సుల్లో కొల్లూరుకు తీసుకొని వెళ్తామని చెప్పారు. సొంత నిధులతో 10వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పనగేశ్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ విజయ్‌కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, తహసీల్దార్ భాస్కర్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.