జహీరాబాద్, ఆగస్టు 29 : ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అభివృద్ధి పనులను వెంటనేపూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. జహీరాబాద్ మున్సిపల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 15 వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
రెడ్డి సంఘం, జంగం సమాజం, మున్నూరు కాపు సంఘలకు భవనాలు నిర్మించేందుకు స్థలం ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్డీఎఫ్ నిధులతో చేస్తున్న పనులను పూర్తి చేయాలన్నారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో హోతి(కే) శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఆర్డీవో వెంకారెడ్డి, నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్లు రాధాబాయి, మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ పాఠశాలల తనిఖీ
సదాశివపేట, ఆగస్టు 29: ప్రతిష్టాత్మక మనఊరు – మన బడి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని నందికంది ఉన్నత, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను పరిశీలించిన కలెక్టర్ బాలికల మరుగుదొడ్లు రెండు యూనిట్లు, 30 మీటర్ల ప్రహరీ, వంట గది, పెయింటింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. సర్పంచ్ కుందెన రాజు సొంత ఖర్చులతో విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో అంజయ్య, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో పూజ, సర్పంచ్ కుందెన రాజు పాల్గొన్నారు.
మహిళలకు మెరుగైన వైద్యసేవలు
కోహీర్, ఆగస్టు 29: మహిళలందరికీ అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కోహీర్ మండలంలోని బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి మంగళవారం మహిళా ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా మహిళా వైద్యులకు తమ సమస్యలను చెప్పాలన్నారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళలతో కాసేపు మాట్లాడారు. మహిళలకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి మంగళవారం దవాఖానలో ఎంతమందికి వైద్యపరీక్షలు చేస్తున్నారో రికార్డులో నమోదు చేయాలని సూచించారు. మహిళలకు వైద్యం అత్యవసరమైతే సంగారెడ్డి దవాఖానకు పంపించాలన్నారు. సంగారెడ్డి దవాఖానకు తరలించేందుకు బుధ, గురు, శుక్రవారాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రామచంద్రపురం, జిన్నారం, ఝరాసంగం, బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో శంకర్, ప్రోగ్రాం అధికారి భాస్కర్, తహసీల్దార్ శాంతకుమారి, ఎంపీడీవో సుజాతనాయక్, వైద్యులు డాక్టర్ నరేందర్, డాక్టర్ మనూజారెడ్డి, డాక్టర్ దివ్యజ్యోతి, సర్పంచ్ నర్సింహులు, వైద్య సిబ్బంది ఉన్నారు.