అక్కన్నపేట, ఫిబ్రవరి 1: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గుడుంబా గుప్పుమంటున్నది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేయడం, ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.అక్కన్నపేటకు చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ గుడుంబా అమ్మే ఇంటికి వెళ్లి బియ్యం ఇచ్చి గుడుంబా తాగాడు. మరో గిరిజన వ్యక్తి సైతం గుడుంబా బాకీ కింద బియ్యం విక్రయించినట్లు తెలిసింది. తరువాత కుటుంబ సభ్యులు లొల్లి పెట్టి బాకీ డబ్బులు కట్టి బియ్యం బస్తాను తీసుకెళ్లారని స్థానికులు చెప్పారు.
అక్కన్నపేటలో ఐదు వరకు గుడుంబా విక్రయ కేంద్రాలు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. లిక్కర్ తాగే స్థోమత లేని వాళ్లు సాయంత్రం ఈ గుడుంబా అడ్డాలకు వెళ్లి తాగుతున్నట్లు తెలిసింది. లీటర్ గుడుంబా రూ. 100 నుంచి రూ. 150 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ సర్కారు గుడుంబా తయారీపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తిగా అణిచివేసింది. గుడుంబాకు వాడే నల్లబెల్లాన్ని నిషేధించింది. తెల్లబెల్లం విక్రయాలపై ఆంక్షలు పెట్టింది. గుడుంబా తయారీదారులను గుర్తించి, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపింది. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఈ నెలన్నర రోజుల్లోనే తిరిగి తండాల్లో గుడుంబా గుప్పుమంటుండడం విశేషం. వ్యవసాయ బావుల వద్ద, తండాల్లోని ఇండ్ల సమీపంలో గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం. తయారు చేసిన గుడుంబాను రాత్రివేళ్లలో గ్రామాల్లోకి చాటుగా చేరవేస్తున్నట్లు తెలిసింది.