Saddula Bathukamma | రాయపోల్, అక్టోబర్ 1 : సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగాయి. బతుకమ్మ.. దసరా, దేవి నవరాత్రి ఉత్సవాలు ఉండడంతో పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరు గ్రామాల్లోకి చేరుకోవడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది.
రాయపోల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆటపాటలు ఆడరు. అనంతరం ర్యాలీగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన బతుకమ్మ వేడుకలు బుధవారం సాయంత్రం ముగిశాయి.
కాగా గురువారం దసరా ఉత్సవాలు ఉండడంతో గ్రామాల్లో పండుగ శోభను సంతరించుకుంది. బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ గతంలో ఉన్న మాదిరిగా లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. నామమాత్రంగా పనులు చేసి అధికారులు చేతులు దులుపుతున్నారు. గ్రామాల్లో మాజీ ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా వీది దీపాలు వేసుకుని పరిస్థితి ఏర్పడింది. చెరువులు నిండు ఉండడంతో బతుకమ్మ ఘాట్ల వద్ద మహిళలు హారతులు ఇచ్చి బతుకమ్మను నిమజ్జనం చేశారు. మండల వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి.