మెదక్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో రైతు భరోసా సాయం కోసం 472 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 3,99,774 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు తెలుపడంతో ఆ భూములకు రైతు భరోసా ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారు. 21 మండలాల్లోని 493 గ్రామాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుంట భూమి ఉన్నా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేసింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించింది. దీంతో రైతులు పెట్టుబడికి రైతు భరోసా కింద సాయం అందుతుందని ఆశ పడ్డారు. కానీ రైతుల ఆశలన్నీ నిరాశలయ్యాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో రైతు భరోసా సాయం కింద మండలానికి ఒక గ్రామం చొప్పున 21 గ్రామాల్లో మాత్రమే పథకాలను ప్రారంభించారు. 21 గ్రామాల్లో 14,819 మంది రైతులకు రూ.14.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
మెదక్ జిల్లాలో 493 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం కింద కేవలం 21 గ్రామాల్లోనే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. మిగతా 472 గ్రామాల రైతులు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అర్హులైన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందజేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని రైతులు వాపోతున్నారు.
రైతు భరోసా కూడా తమకు వస్తుందో లేదోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఉన్న ప్లాట్లకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపజేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించి సర్వే నంబర్ల ఆధారంగా పరిశీలించారు. దీంతో జిల్లాలో 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు గుర్తించారు. వీటికి రైతు భరోసా నిలిపివేసింది.