ఐదురోజులుగా రైతుబంధు డబ్బులు అకౌంట్లలో జమవుతుండడంతో రైతు ల్లో ఆనందం నెలకొన్నది. సెల్ఫోన్లకు వస్తున్న మెసేజ్లు చూసుకుని డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల వద్దకు వెళ్తున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమైన క్రమంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు, విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– సంగారెడ్డి/మెదక్ (నమస్తే తెలంగాణ), జూలై 1
మెదక్, జులై 1 (నమస్తే తెలంగాణ): రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు డబ్బులు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రతి రోజు ఉదయం నుంచి రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున డబ్బులు వస్తున్నాయి. రైతుల ఫోన్లకు మెసేజ్ వస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతి సీజన్లో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రైతులు సీజన్ రాగానే అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆ డబ్బులతోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
నేరుగా ఖాతాల్లోకి..
మెదక్ జిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపడంతో జిల్లాలోని రైతులందరికీ రైతు బంధు సాయం వారి ఖాతాల్లో పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. నాలుగు రోజులుగా రైతుల ఖాతాల్లో ఈ ఆర్థిక సాయం పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2,36,490 మంది రైతులకు రూ.145 కోట్ల 42 లక్షల 19వేల 932 వారి ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు.
3.05 లక్షల మందికి ‘రైతుబంధు’
సంగారెడ్డి జూలై 1(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ రైతులకు పంట సాగు కోసం రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ వానకాలం సీజన్ 2023కు సంబంధించి రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు ఐదు రోజులుగా జమ అవుతున్నాయి. వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం వరకు సంగారెడ్డి జిల్లాలో 3,05,293 మంది రైతుల ఖాతాల్లో రూ.224.13 కోట్ల రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి. అధికారుల సమాచారం మేరకు శనివారం 3,05,293 మంది రైతుల ఖాతాల్లో రూ.224.13 కోట్లు జమ అయ్యాయి.