సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 17: ‘అతిథుల ఆర్తనాదాలు’ అనే శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాల్లో ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్న తీరును కథనంలో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు అతిథి అధ్యాపకులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఇన్నాళ్లుగా కదలని వేతన బడ్జెట్ ఫైల్ చకచకా ఆయా దశలను పూర్తి చేసుకొని ఎట్టకేలకు వేతనాలు విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ఆయా కళాశాలలకు అక్టోబర్ వరకు మొత్తం రూ.63 లక్షల, 76 వేల 110 విడుదలయ్యాయి. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు రూ.20 లక్షల 33వేల 460 విడుదల కాగా, పటాన్చెరు ప్రభుత్వ కళాశాలకు రూ.10లక్షల 55 వేల 730, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.6 లక్షల 34వేల 140, జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.8 లక్షల 98వేల 560, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.7 లక్షల 42 వేల 560, సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 లక్షల 5 వేల 440, సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు రూ.5 లక్షల 6 వేల 220ల నిధులు విడుదలయ్యాయి. అయితే ఇందుకు సంబంధించిన ఆథరైజేషన్ కూడా త్వరగా ఇప్పించి తమ ఖాతాల్లో జమ చేయాలని అతిథి అధ్యాపకులు కోరుతున్నారు.