ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేక ఆమడదూరంలో పల్లెలు ఉండేవి. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు కేటాయించడంతో పల్లెలు అభివృద్ధి బాటపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ప్రతి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన అక్బర్పేట గ్రామంపై ప్రత్యేక కథనం…
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), ఆగస్టు 24: కొన్నేండ్లుగా భూంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామంగా అక్బర్పేట ఉండేది. భూంపల్లి గ్రామానికి నిధులు వచ్చినా అభివృద్ధి అంతంత మాత్రమే. భూంపల్లి గ్రామం నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీ అయినప్పటికీ సమైక్యరాష్ట్రంలో నిధులు మంజూరు కాక అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అక్బర్పేట గ్రామ రూపురేఖలే మారిపోయాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ అవార్డును కూడా దక్కించుకుంది.
అక్బర్పేట గ్రామంలో 591 మంది జనాభా ఉన్నది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామం నుంచి భూంపల్లి వైపునకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణానికి రూ.4 లక్షలు, రోడ్డు భవనాల శాఖ నుంచి మంజూరైన రూ.30 లక్షలు, పంచాయతీ రాజ్ నిధులు రూ.20 లక్షలతో కలిసి మొత్తం రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.9 లక్షల నిధులతో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణం, రూ.4 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి ప్రహరీ నిర్మాణం, 20 లక్షలతో విశ్రాంతి భవనం ప్రస్తుతం అదే భవనంలో నూతన తహసీల్ కార్యాలయం కొనసాగుతున్నది. రూ.20 లక్షలతో పల్లె దవాఖాన, రూ.12,50 లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షలతో క్రీడా ప్రాంగణం, రూ.2 లక్షలతో నర్సరీ, గ్రామంలో మంచి వెలుతురు ఇవ్వడానికి రూ.3 లక్షలతో ఎల్ఈడీ లైట్లు, రూ.2 కోట్లతో డీసీసీబీ బ్యాంకు, ఎసీర్డ కాలనీలో రూ.2 లక్షలతో మురుగు కాల్వలు, ఎస్సీ కాలనీలో తాగునీటి పైపులైన్‌కు రూ.లక్షతో పనులు చేశారు. మొత్తం గ్రామంలో రూ.3 కోట్ల 50లక్షల నిధులతో సీఎం కేసీఆర్ చలువతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నిరంతర కృషితో అభివృద్ధి జరిగింది. గ్రామంలో 300 నల్లా కనెక్షన్లతో మిషన్ భగీరథ పథకంలో నీటిని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కృషితో అక్బర్పేట గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
ఉమ్మడి మిరుదొడ్డి మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో అక్బర్పేట గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాల్లో గంగా అవార్డు దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో చేసిన అభివృద్ధి వల్లే మా గ్రామానికి అవార్డు వచ్చిందని సర్పంచ్ ధర్మారం స్వరూపాభిక్షపపతి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెపారు.
ఎన్నో ఏండ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని అక్బర్పేట గ్రామం నేడు స్వరాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషితో గ్రామంలో అభివృద్ధి పనులు జరగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమైక్యపాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం పరిపాలన దక్షత కలిగిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అయిన తర్వాత అభివృద్ధిని సాధిస్తూ అవార్డు అందుకున్నది. అభివృద్ధిలో ఇతర గ్రామాలకు అక్బర్పేట గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది.
పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతున్నది. గ్రామంలో రూ.3.50 కోట్లతో అక్బర్‌పేటలో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రతి సమస్యను పరిశీలిస్తున్నాం. మరిన్ని నిధులతో ఇంకా అబివృద్ధి చేస్తాం.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు