గజ్వేల్, మే 24: పొద్దుతిరుగుడు పంట విక్రయించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు డబ్బులు ఖాతాలో పడుతాయోనని రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో కేంద్ర ప్రభుత్వం విధించిన లక్ష్యం మేరకు నిర్వాహకులు పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు పూర్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు కొద్ది రోజుల్లోనే ఖాతాలో జమయ్యాయి.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన డబ్బులు నేటికి పడక పోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మార్చి, ఏప్రిల్ నెలల్లో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు. బెజ్జంకి, హుస్నాబాద్, కట్కూర్లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పంటను కొనుగోలు చేశారు. జిల్లాలోని ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా 4306 మంది రైతుల నుంచి 45,261క్వింటాళ్ల పొద్దుతిరుగుడు సేకరించారు.
క్వింటాల్‌కు రూ.7280 చొప్పున కొనుగోలు చేశారు. జిల్లాలో 2314మంది రైతులకు సుమారు రూ.17కోట్ల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లకు చేతిలో డబ్బులు లేక రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి ఉంది. చాలామంది రైతులకు రైతుభరోసా సాయం అందలేదు. పొద్దుతిరుగుడు రైతులు డబ్బుల కోసం పీఏసీఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పది రోజుల్లో డబ్బులు జమవుతాయి..
పొద్దుతిరుగుడు రైతులకు డబ్బులు పది రోజుల్లో వారి ఖాతాల్లో జమవుతాయి. రైతులకు రావాల్సిన డబ్బుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రైతులు ఈ విషయంలో ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో డబ్బులు తప్పకుండా వస్తాయి.
– క్రాంతి, మార్క్‌ఫెడ్ డీఎం, సిద్దిపేట