Rice Rates | మెదక్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో బియ్యం ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలోనే బియ్యం రకాన్ని బట్టి క్వింటాకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సాకుగా చూపుతూ కొందరు మిల్లర్లు, టోకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గోదాముల్లో తగినంత నిల్వలు ఉన్నప్పటికీ మార్కెట్‌కు సరఫరాను తగ్గించి ధరలను అమాంతం పెంచుతున్నారని చిల్లర వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీనికి బ్రోకర్ల వ్యవస్థ కూడా తోడవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పేదలపై పెనుభారం..
జిల్లాలో ఎక్కువ మంది మధ్యతరగతి, కూలీ కుటుంబాలు మార్కెట్లో కొనుగోలు చేసే బియ్యంపైనే ఆధారపడుతున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ గందరగోళంగా మారింది. కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు వందల రూపాయల అదనపు భారం పడుతోంది.
సరఫరా తగ్గించి ధరల పెంపు..
జిల్లాలో సన్న బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండటంతో తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయకుండా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం స్పందించాలంటున్న ప్రజలు..
అత్యవసర వస్తువుల ధరలు అదుపు తప్పుతున్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ కోసం సంబంధిత శాఖలు మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణ చేపట్టి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, సిండికేట్ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, చిల్లర వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రధాన బియ్యం ధరలు (క్వింటాకు)..
కర్నూలు సోనా మసూరి – సుమారు రూ.6,000, బీపీటీ – రూ.6,200 పైగా అమ్మకం చేస్తున్నారు. ఇతర రకాలు – రూ.1,200–1,500 వరకు పెరుగుదల (20 రోజుల్లో) కృత్రిమ కొరతను అరికట్టి బియ్యం ధరలను నియంత్రించాలి. పేద, మధ్యతరగతి ప్రజలపై పెరుగుతున్న భారం తగ్గించేలా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర
Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్‌పై నుంచి కిందపడి నవ వధువు మృతి