Sircilla | రాజన్న సిరిసిల్ల, జూలై 19( నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు తళుక్కున మెరిశాయి. శనివారం నాడు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన భారత తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో పాల్గొన్న ఇంజినీర్లలో ముగ్గురు సిరిసిల్లకు చెందిన వారే ఉండటం గర్వకారణంగా నిలిచింది. పైగా ఆ ముగ్గురు ఇంజినీర్లు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ ఆగమన్‌లో సిరిసిల్లకు చెందిన సోదరులు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్, బొమ్మదేవి నాగరాజు విశేష సేవలు అందించారు. వీరిలో సంతోష్ ఏవియానిక్స్ చెక్అవుట్ లీడ్‌గా పనిచేశారు. ఏవియానిక్స్ వ్యవస్థల తనిఖీ పరీక్షలు, ప్రయోగానికి ముందు కీలకమైన గ్రౌండ్ చెక్అవుట్ కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహించారు. కిరణ్ రాకెట్ క్యాడ్ డిజైనర్‌గా సేవలందించారు. రాకెట్ రూపకల్పనకు సంబంధించి డిజైన్ పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఇక బొమ్మదేవి నాగరాజు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణ పనులను విజయవంతంగా నిర్వహించారు.
ప్రపంచ వేదికపై భారత ప్రైవేటు అంతరిక్ష రంగ సంస్థ తన సామర్థ్యం చూపించి, అపూర్వ విజయం సాధించగా.. ఆ ప్రయోగంలో తమ ప్రాంతవాసులు ముఖ్య పాత్ర పోషించడంపై సిరిసిల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభాపాటవాల ద్వారా సిరిసిల్ల ఖ్యాతిని దశ, దిశలా చాటారని ముగ్గురు ఇంజినీర్లను అభినందిస్తున్నారు.