Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్న బహదూర్‌గూడ రైతులను అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి.. చివరకు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వదిలేశారు. అదే సమయంలో రైతులు నిర్వహిస్తున్న దీక్షాస్థలంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను పూర్తిగా తొలగించి, ఫెన్సింగ్ వేశారు.
ఇదిలా ఉంటే.. బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వేనంబర్ 28లో 150 ఎకరాలు, సర్వేనంబర్ 62లో 500 ఎకరాలను మొత్తంగా 650 ఎకరాలకు సంబంధించి శనివారం జరిగిన భూసేకరణ ప్రక్రియ పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులు, గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు నినాదాలు చేస్తూ అధికారులను నిలదీశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతులకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు గ్రామానికి చేరుకొనే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని సైతం అడ్డుకొన్నారు. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సరైన పరిహారం. పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపి తమకు సరైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. భూసేకరణ అంశంతో బహదూర్‌గూడలో రోజంతా ఉత్కంఠ వాతావరణం కొనసాగగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు.