Gastroenteritis | వర్షాకాలం సీజన్ అంటేనే చాలా మందికి రోగాల సీజన్ అనే భావన ఉంటుంది. అందుకు కారణం ఒక్క సారిగా మారే ఉష్ణోగ్రతలతోపాటు, అదే సమయంలో వాతావరణంలో ఉండే తేమ, బ్యాక్టీరియా, వైరస్‌లకు అనుకూల వాతావరణం ఏర్పడడం, ఇంటి చుట్టు పక్కల లేదా ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్య సమస్యలు, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వంటివి కూడా తోడవుతుంటాయి. దీంతో ఈ సీజన్లో అనేక రోగాల నుంచి ముప్పు ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఇక ఈ సీజన్లో చాలా మందికి వచ్చే సమస్యల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్ కూడా ఒకటి. దీన్నే స్టమక్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణాశయం, పేగులలో ఏర్పడే ఇన్ఫెక్షన్. ప్రధానంగా నోరోవైరస్, రోటావైరస్ వంటి వైరస్ల వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా కూడా దీనికి కారణమవుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అంటువ్యాధి. కలుషితమైన చేతులు, ఉపరితలాలు లేదా సన్నిహిత సంబంధాల ద్వారా ఒకే కుటుంబంలో లేదా కార్యాలయంలో పలువురికి సోకే అవకాశం ఉంటుంది.
ఫుడ్ పాయిజనింగ్ అంటే కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల సంభవించే సమస్య. ఈ.కోలి, సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా లేదా అవి విడుదల చేసే విషపదార్థాల కారణంగా ఇది వస్తుంది. గ్యాస్ట్రోఎంటరైటిస్లా ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు. అయితే ఒకే కలుషితమైన ఆహారాన్ని తిన్నవారిలో ఒకేసారి ఈ సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. ఈ రెండు సమస్యల్లోనూ తరచూ నీళ్ల విరేచనాలు, వికారం, వాంతులు, కడుపు నొప్పి, కడుపులో మెలికలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల వాటిని వేరు చేయడం కొంత కష్టంగా ఉంటుంది. గ్యాస్ట్రోఎంటరైటిస్లో మాత్రం సాధారణంగా స్వల్ప జ్వరం, చలిగా అనిపించడం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పి, తీవ్రమైన అలసట వంటి శరీరమంతా ప్రభావితం చేసే లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా 24 గంటల్లో క్రమంగా పెరుగుతాయి.
ఫుడ్ పాయిజనింగ్‌లో లక్షణాలు చాలా వేగంగా ప్రారంభమవుతాయి. కలుషితమైన ఆహారం తిన్న కొద్దిసేపటికే తీవ్ర వాంతులు, తీవ్రమైన కడుపు మెలికలు, కొన్నిసార్లు మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు వస్తాయి. అదే ఆహారం తిన్న మరికొందరిలో కూడా ఇలాంటి లక్షణాలు ఒకేసారి కనిపించడం ఫుడ్ పాయిజనింగ్‌కు సంకేతంగా భావిస్తారు. వర్షాకాలంలో మురుగునీరు తాగునీటిలో కలవడం వల్ల జీర్ణాశయ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అధిక తేమ, మోస్తరు ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా ఆహారంలో వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్ల పక్కన విక్రయించే ఆహారం, మూత లేకుండా ఉంచిన పదార్థాలు, మరిగించని నీటితో తయారుచేసిన చల్లని పానీయాలు, కలుషితమైన ఐస్‌క్యూబ్స్ ఉపయోగించిన పానీయాలు ఈ కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్కు ఎక్కువగా వైరస్‌లే కారణమవుతాయి కాబట్టి యాంటీబయోటిక్స్ సాధారణంగా ఉపయోగపడవు. విశ్రాంతి తీసుకోవడం, శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేయడానికి ఓఆర్ఎస్ (ORS) ద్రావణం తీసుకోవడం ప్రధాన చికిత్సగా ఉంటుంది. చాలావరకు ఈ వ్యాధి కొన్ని రోజుల్లో స్వయంగా తగ్గిపోతుంది.
ఫుడ్ పాయిజనింగ్‌లో తేలికపాటి కేసులకు కూడా తగినంత ద్రవాలు తీసుకోవడం, ఓఆర్ఎస్ వాడటం, కొంతసేపు ఘన ఆహారం తీసుకోకుండా ఉండటం సరిపోతుంది. అయితే సాల్మొనెల్లా వంటి తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు యాంటీబయోటిక్స్ అవసరం అవుతాయి. కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. నోరు ఎండిపోవడం, తలతిరగడం, మూత్రం తగ్గిపోవడం వంటి తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు, ఏ ద్రవమూ కడుపులో నిలవకుండా నిరంతరం వాంతులు కావడం, మలంలో రక్తం లేదా అధిక మ్యూకస్ కనిపించడం, 38.3 డిగ్రీల సెల్సియస్ (101 డిగ్రీల ఫారెన్‌హీట్) కంటే ఎక్కువ జ్వరం, 48 నుంచి 72 గంటల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోవడం లేదా మరింత తీవ్రమవడం వంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి.
వర్షాకాలంలో ఈ సమస్యలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఫిల్టర్ చేసిన లేదా మరిగించిన నీటినే తాగాలి. తెలియని ప్రాంతాల్లో తయారైన ఐస్‌క్యూబ్స్‌ను ఉపయోగించకపోవడమే మంచిది. తాజాగా వండిన వేడి ఆహారాన్నే తినాలి. ఎక్కువసేపు బయట ఉంచిన లేదా పాత ఆహారాన్ని తీసుకోవద్దు. భోజనం చేసే ముందు, వంట చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మరిగంచని నీటితో తయారుచేసిన చట్నీలు, శుభ్రంగా కడగని ఆకుకూరలు, అపరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వల్ల వర్షాకాలంలో వచ్చే జీర్ణాశయ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.