పటాన్చెరు, డిసెంబర్ 13: ప్రజల ఆకాంక్షల మేరకు ప్రగతి పనులు చేపడుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాలులో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మున్ముందు అదేస్ఫూర్తితో పనిచేస్తామన్నారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉంటుందని చెప్పారు. ప్రజా అవసరాలు, భవిష్యత్ డిమాండ్లను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పనులు చేద్దామన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.
నీటి పారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల పనులు ముఖ్యమైనవని తెలిపారు. నిర్దేశించిన పనులకు నిధులు, ఇతర ఆదాయ వనరులను సమకూర్చుకొని పనులు పూర్తి చేయాలన్నారు. నిధుల కొరత ఉంటే తనకు తెలపాలన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్సార్ నిధులు కూడా వాడుకొని పనులు చేపట్టాలన్నారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును విస్తరిస్తున్నామని తెలిపారు. యార్డ్ సమీపంలోని రైల్వే శాఖకు సంబంధించి 20 ఎకరాల భూమిని మార్కెట్ యార్డుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నామన్నారు. ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, దేవానందం, ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.