నంగునూరు, ఫిబ్రవరి 11 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణంలో ఆయన పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం అంటే ఎంతో ఇష్టమన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఆల యం నుంచే ప్రారంభించి రాష్ర్టాన్ని సాధించారన్నారు. కేసీఆర్ ఏముఖ్య కార్యక్రమాన్ని తీసుకు న్నా ఈ దేవాలయం నుంచే ప్రారంభిస్తారన్నారు. రూ.3.6 కోట్లతో ఆలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 15 నెలలుగా దేవాలయాలకు నిధు లు విడుదల చేయడం లేదన్నారు. కొత్తగా ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయకపోవడమే కాకుండా.. గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేసినట్లు తెలిపారు.
దేవుళ్ల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా పంట రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి మోసం చేశారన్నారు. మాట తప్పడం తప్పా నిలబెట్టుకోవడం రేవంత్‌రెడ్డికి చేతకాదన్నారు. జనవరి 26కి రైతుభరోసా, ఇందిరమ్మ భరోసా ఇస్తామని ఇప్పటి వరకు వేయలేదన్నారు. వానకాలం రైతుబంధు ఎగబెట్టి రూ.8 వేల కోట్లు రైతులకు అందకుండా చేశారన్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టారన్నారు. మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌పామ్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్‌గౌడ్, నాయకులు మల్లయ్య, భూపేశ్ పాల్గొన్నారు.