రాయపోల్, అక్టోబర్ 29 : మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ మండల ఎస్సై మానస హెచ్చరించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి రూ. 10 వేల జరిమానా విధించడం లేదా ఆరు నెలలు జైలు శిక్ష అమల్లోకి రావడం జరిగింది. ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించి రెండవసారి వాహనం నడుపుతూ పట్టుపడితే రూ. 15 వేల జరిమానా విధించడం జరుగుతుంది. జరిమానా డబ్బులు కట్టని వారికి, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపవద్దు,. తల్లి తండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, సైలెన్సర్ మార్చి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. పై నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ మానస హెచ్చరించారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
వాహనాలు కలిగిన ప్రతిఒక్కరూ ఖచ్చితంగా రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్సై మానస సూచించారు. వాహనదారులు హెల్మెట్లను ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలతో పాటు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని ఆమె తెలిపారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మానస హెచ్చరించారు.