Medak | రామాయంపేట, జూన్ 29 : మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురై కొన్ని గ్రామాల్లోనైతే ట్రాక్టర్ ట్యాంకర్లతో భూములను తడిపారు. మూడు రోజుల క్రితం కుంభవర్షం కురిసింది. అదే అలాగే పడుతుంది అనుకుంటే మళ్లీ వర్షాలు కురవడం లేదు. దీంతో వేసిన మొక్కజొన్న, పత్తి పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. రైతన్న మూడు రోజులుగా వర్షాలు కురవక పోవడంతో కకావికలమై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఆదివారం రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో చెరువుల వద్దనుండి బిందెల ద్వారా నీరు తెచ్చి హనుమాన్, శివాలయాల్లో దేవుళ్లకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వరుణదేవా కరుణించవా అంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అన్నదాతలు వర్షాలు కురవాలంటు పంట భూములలో వరుణదేవా వానలు పడగొట్టాలంటూ మొక్కులు మొక్కుతూ ఆకాశాన్ని చూస్తున్నారు. ఏది ఏమైనా వరుణదేవుడు కరుణిస్తేనే రైతులకు పంటలు లేకుంటే రైతులు పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాకుండా పోతాయి. ఎండలు మండిపోవడంతో వేసిన పంటలు కూడా వాడు ముఖం పట్టాయి.