రామాయంపేట, జూలై 18: మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విదార్థినులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో స్నానం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
కోమటిపల్లి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో ఇటీవల కేజీబీవీలో ఉన్న ఒకే ఒక్క బోరు బావి కూడా ఎండిపోయింది. దీంతో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిపైనే కేజీబీవీ ఆధారపడింది. కానీ గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికే కాకుండా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలకు కూడా నీళ్లు ఉండటం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది ట్యాంకర్ తెప్పిస్తున్నప్పటికీ అవి సరైన సమయంలో రావడం లేదు. దీంతో ట్యాంకర్ వచ్చే వరకు బహిర్భూమి కూడా వెళ్లకుండా ఉండిపోవాల్సి వస్తుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేజీబీవీలో నీటి సమస్యతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. తాగునీటితో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్ తెప్పించి, విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వివరించారు.