సిద్దిపేట జిల్లాలో 92 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న రాజీవ్ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంటుంది. నాలుగు వరుసలుగా విస్తరించిన రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలో లోపాలను సరిచేయలేదు. మూలమలుపులను సరిచేయకపోవడంతో అవే ప్రాంతాలు తరుచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
గజ్వేల్, జూన్ 22: సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలై బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి వరకు 92 కిలోమీటర్ల మేర పొడవు ఉంది. ఈ రహదారిపై 15ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు బ్లాక్స్పాట్లు గుర్తించారు. వీటితో పాటు గ్రామాల మూలమలుపుల వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 500వరకు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అనేక కుటుంబాల్లో విషాదం అలుముకుంటున్నది.
ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృతి చెందగా చాలామంది క్షతగాత్రులయ్యారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. దీంతోపాటు రహదారిపై నిర్మాణ లోపాలు సరిచేయలేదు. వ్యవసాయ పొలాల నుంచి అడ్డంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆయా గ్రామాల వద్ద రోడ్డు దాటే ప్రాంతాల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.
రాజీవ్ రహదారిపై రోజూ వేలాది వాహనాలు అధిక వేగంతో వెళ్తుంటాయి. ఇదే మార్గంలో పోలీస్స్టేషన్లు ఉన్నా వేగ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టలేదు. అతివేగంతో వాహనాలు వెళ్లడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణ సమయంలో రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించారు. ఆసమయంలో నిర్మాణ లోపాలను సరిచేయలేదు. రహదారి నిర్మాణ సమయంలోనే లోపాలను సరిచేస్తే ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు.
రాజీవ్ రహదారి వెంబడి ఉన్న గ్రామాల వద్ద రోడ్డు దాటాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని దాటాల్చి వస్తున్నది. అతివేగంతో వచ్చే వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టక పోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు, గౌరారం, రిమ్మన గూడ, కొడకండ్ల, దుద్దెడ క్రాసింగ్ వద్ద రోడ్డు దాటాలంటే ప్రజలు తమప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి ఉంది.
సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి మార్కెట్ వద్ద ఉదయం సమయంలో మార్కెట్‌కు వచ్చే రైతులు ద్విచక్ర వాహనాలతో రాంగ్రూట్లో వెళ్తుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు చౌరస్తాలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, గ్రామస్తులు రోడ్డు దాటాలంటే జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ములుగు ఎంపీడీవో కార్యాలయం, సింగాయిపల్లి చౌరస్తా, రాణే కంపెనీ ప్రాంతం, రిమ్మనగూడ, కొడకండ్ల, చిన్నకిష్టాపూర్ చౌరస్తా, కుకునూర్‌పల్లి గ్రామ సమీపంలోని క్రాసింగ్ వద్ద, తిమ్మారెడ్డిపల్లి క్రాసింగ్ వద్ద, రంగధాంపల్లి, పొన్నాల, చిన్నకోడూరు మండలం రామునిపట్ల, మందపల్లి, ఇబ్రహీంపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈప్రాంతాల వద్ద ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడితే ప్రమాదాలను కొంతమెరకైనా అరికట్టవచ్చని స్థానికులు కోరుతున్నారు.