జిల్లాలో వానకాలం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వడ్ల రాశులతో కనిపిస్తున్నది. రైతులు రోడ్లపైన పంట నూర్పిళ్లు చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పంట నూర్పిళ్ల మూలంగా ఎంతోమంది వాహనదారులు మృత్యుఒడికి చేరుకుంటున్నారు.
ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒక ఘటనలో ముగ్గురు, మరో ఘటనలో ఇద్దరు చనిపోయారు. రామాయంపేట ఉమ్మడి మండల వ్యాప్తంగా ఎటుచూసినా రోడ్ల వెంట పంటనూర్పిళ్లే కనిపిస్తాయి. ఉమ్మడి మండల కేంద్రం రామాయంపేట నుంచి గజ్వేల్, మెదక్ వెళ్లే దారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డలో రైతులు వరి, మొక్కజొన్న నూర్పిళ్లు చేపడుతూ రహదారలను మొత్తం ఆక్రమిస్తున్నారు.
దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై రైతులు ధాన్యం పోయకూడదని, రోడ్లపై పంట నూర్పిళ్ల మూలంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల్లో రోడ్లపై నూర్పిళ్లు చేస్తున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేసి, కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. – రామాయంపేట, నవంబర్ 22