తూప్రాన్/మనోహరాబాద్, జూన్ 6: తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండలాల్లో వర్షం దంచికొట్టింది. రెండు రోజులుగా చిరుజల్లులతో పలుకరించిన వర్షం గురువారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. తూప్రాన్ మండలం మల్కాపూర్‌లోని మూడో వార్డులో అంతర్గత మురికికాల్వ కోసం నెల క్రితం పనులు మొదలుపెట్టి పూర్తి చేయకపోవడంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలం మొదలవ్వకముందే పనులను పూర్తి చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిన్నారం, మే 6: మండల వ్యాప్తంగా గురువారం వాన దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. పారిశ్రామికవాడలో రసాయన వ్యర్థాలు వాన నీటిలో కలిసి చెరువు, కుంటల్లోకి చేరాయి. వ్యవసాయ పనులకు చాలా మేలు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. రాత్రి వరకు రాలేదు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
న్యాల్కల్, జూన్ 6: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ వర్షం వానకాలం సాగుకు ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆత్నూర్లోని మున్నురు పోచమ్మ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది.
హత్నూర, జూన్ 6: భారీగా వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పంటసాగుకు సిద్ధమయ్యారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.