సిద్దిపేట, నవంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసిన తర్వాతనే సర్వేకు రావాలని నిలదీస్తున్నారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక ఎన్యూమరేటర్లు తల పట్టుకుంటున్నారు. సంక్షేమ పథకాలను కోత పెట్టేందుకే ఈ సర్వే చేస్తున్నారా అంటూ ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా అప్పుల గురించి అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం కడుతుందా..? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. మభ్యపెట్టేందుకే ఈ సర్వే అంటూ ప్రభుత్వ తీరుపై ప్రజలు మండి పడుతున్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి విచిత్ర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దేనికోసం ఈసర్వే చేస్తున్నారు..? దీనికి చట్టబద్ధత ఉందా..? మేము చెప్పిన సర్వే వివరాలు గోప్యంగా ఉంచుతారా..? అనే నమ్మకం ఏమిటీ ఇలా విభిన్న ప్రశ్నలను ప్రజలు సంధిస్తుండడంతో ఎన్యూమరేటర్లు తలపట్టుకుంటున్నారు. తమను ప్రభుత్వం పంపిందని, తాము సర్వేకు వచ్చామని, మీరు వివరాలు చెబితే రాసుకుంటామని, లేకపోతే లేదు అంటూ వారి నుంచి సమాధానం వస్తున్నది. సర్వేలో పొందు పరిచిన పలు అంశాలపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు.మేము తీసుకున్న అప్పుల వివరాలు అడుగుతున్నారు.. మా అప్పులు మీరు కడుతారా..? మాకు ఎంత అప్పు ఉంది అని అడిగినప్పుడు మీరు కడతారా..? అనే గ్యారంటీ మాకు ఇవ్వాలి కదా అని సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నించడంతో వారు మౌనంగా ఉండి పోతున్నారు. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి..? ఎంత జాగా ఉంది అని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం వద్ద లేవా..? మేము కరెంట్ వాడుతుంది ప్రభుత్వానికి తెలువదా…? మా పేర్లపై ఎంత భూమి ఉంది ప్రభుత్వం వద్ద లెక్కలు లేవా..? ఇలా ప్రజలు ప్రశ్నించడంతో ఎన్యూమరేటర్లు ఏం చేయాలో అర్ధం కాక భిక్కమొహం వేస్తున్నారు. మరికొన్ని కుటుంబాలు సర్వే వివరాలు చెప్పడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం సర్వే చేస్తున్నామని చెబుతున్నది. కానీ, దాని వెనక వేరే ఆలోచర ఉన్నట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు హామీలను అమలు చేయడానికి కిందామీద పడుతున్నది. అందుకే సర్వేలో 75 ప్రశ్నలను పొందుపరిచి ఆదాయ వ్యయాల లెక్కలను అడుగుతున్నది. ఎంత భూమి ఉంది.. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి. ఇలా సమగ్ర సర్వేను చేపడుతున్నది. దీంట్లో వచ్చిన ఆధారంగా సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒకేరోజు చేసిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ప్రభుత్వం వద్ద ఉంది. ఆ సర్వే కాదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల్లో కోతలు పెట్టడానికి ఈ సర్వే చేస్తూ కాలయాపన చేయడంతో పాటు భారీగా లబ్ధిదారులను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. సర్వే ప్రశ్నలను చూసి ప్రజలందరూ అదే జరుగుతదని ఆందోళన చెందుతున్నారు. వృద్ధ్దులకు, వింతతువులకు, ఓంటరి మహిళలకు, దివ్యాంగులకు పింఛన్ రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది పూర్తయినా ఇంత వరకు ఆ హామీ నెరవేర్చలేదు. రైతుబంధు ఇవ్వడం లేదు. పంట రుణమాఫీ అసంపూర్తిగా చేసింది. ఇతర పథకాలు అమలు కావడం లేదు. ఇప్పుడు సర్వేచేసి పథకాల్లో కోతల పెడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మద్దూరు, నవంబర్ 13: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు గ్రామాల్లో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. సర్వేలో కుటుంబ వివరాలు చెప్పేందుకు ప్రజలు ససేమేరా అంటుండడంతో ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో కుటుంబాన్ని సర్వే చేసేందుకు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుండడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు రెండు నుంచి మూడు కుటుంబాలను మాత్రమే సర్వే చేయగలుగుతున్నారు. ఉపాధ్యాయులకు సర్వే బాధ్యతలు అప్పజెప్పడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం సర్వే కోసం ఇండ్లకు వెళ్లుతుండడంతో ఇండ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి.
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ఇండ్ల వద్ద ప్రజలు ఉండడం లేదు. దీంతో సర్వే కోసం వెళ్లిన ఉపాధ్యాయులు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు జనం సుముఖత చూపడం లేదు. ప్రధానంగా వ్యక్తిగత, ఆర్థిక వివరాలు చెప్పేందుకు జనాలు నిరాకరిస్తున్నారు. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లకు ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సర్వేలతో ప్రజలకు అదనంగా ఒరిగే లాభం ఏమిటని నిలదిస్తున్నారు. దీంతో ఎన్యూమరేటర్ల పరిస్థితి ‘ముందుకు పోతే గొయ్యి, వెనకకు పోతే నుయ్యి’ అన్న చందంగా మారింది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతున్న ఎన్యూమరేటర్లను ప్రజల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నిజాంపేట, నవంబర్ 13: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుం చి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని తిప్పనగుల్లలో చేపడుతున్న కుటుంబ సర్వేలో భాగంగా ఇంటికీ వెళ్లిన ఎన్యూమరేటర్ లలితకు గ్రామస్తురాలు నాగలక్ష్మి రైతుబంధు ఎప్పుడు ఇస్తరంటూ అడింది. 90శాతం మంది ప్రజలు రైతుబంధు ఏమైందని, ఎప్పుడు పైసలు వస్తాయంటూ ప్రశ్నిస్తున్నారని ఎన్యూమరేటర్ తెలిపారు.
కుటుంబ సర్వేలో భాగంగా ఖాసీంపూర్ తండాలో ఇంటింటికీ వెళ్లి వివరాలు అడుగుతున్న క్రమంలో ప్రజలు అప్పులు మాత్రమే తెలుపుతూ.. ఆస్తుల వివరాలు తెలుపడానికి సతమతమవుతున్నారు. ఎక్కువ మంది రైతుబంధు పైసలు ఎప్పుడోస్తాయని అడుగుతున్నారు. ముందు రైతుబంధు ఇచ్చి సర్వేకు రావాలంటున్నారు.
మహిళలకు ఫ్రీ బస్సు మాత్రమే ఇచ్చిం డ్రు.. అవసరం ఉన్నవాళ్లే బస్సు ఎక్కుతరు.. బస్సు ఎక్కాలంటేనే భయం అవుతున్నది. మీకు ఫ్రీబస్సే కదా.. అక్కడికి పోండ్రి… వెనుక కూసోపోండ్రని కండక్టర్లు అంటండ్రు… ఫ్రీ బస్సు అవసరం లేదని.. మేము ఎంత ఇబ్బందిపడుతున్నమని మాకు తెలుసు. మీరు గీడికీడికే బస్సు ఎక్కుతర.. ఎందుకు వచ్చుడు.. గిట్ల మమ్మల్ని మాటలు అంటండ్రు… ఉన్నవాళ్లకంటే లేని వాళ్లకు పథకాలు ఇవ్వాలి కదా.. ఎన్నికలప్పుడు అన్ని చేస్తామని చెప్పిండ్రు… ఇంటింటికి తిరిగి రాసుకున్నరు. కానీ ఇయ్యలేదు.. మా ఆయన నేను పనిచేసుకుని బతుకుతన్నం. రెండువేల ఐదువందలు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటివరకు ఇయ్యలే.. ఈ విషయం సర్వేలో పెట్టలేదు.. ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేదు మాకు.. గ్యాస్ డబ్బులు కూడా రాలేదు… గవర్నమెంట్ ఇప్పటి వరకు మాకు ఏం ఇయ్యలే… సర్వే చేస్తున్నరు కానీ, సర్కారే సాయం చేయ్యలే…
– అంబటి రమాదేవి, హుస్నాబాద్ టౌన్
ఎలచ్చన్లా రూ.2500 ఇస్తమన్నరు. కాంగ్రెస్ ఎక్కినకాంచి అన్నీ ఇస్తమన్నరు.. ఏమీ రాలే. రైతుబంధు సాయం కూడా ఇప్పటి వరకు రాలేదు…. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు… ఏడాదికి రెండుమార్ల రైతుబంధు వచ్చేది… ఇప్పుడు ఎత్తనే లేరు.. రుణమాఫీ అంటండ్రు.. ఇప్పటి వరకు సగం మందికి కూడా చేయలేదు. మాకు లేకపోయినా కనీసం రైతుబంధు ఎందుకు ఇయ్యలే… ఎకరం భూమి మాత్రమే మాకు ఉన్నది. అప్పులు తెచ్చుకుని ఎవుసం చేసుకుంటున్నం. కేసీఆర్ రాసిన పింఛన్ వత్తంది.. పింఛన్ పైసలతో గోలీలు తెచ్చుకొని బతుకుతున్నం.. గిప్పటివరకు కూడా మాకు న్యాయం జరగలె.. ఓట్లప్పుడు కనిపిస్తరు.. ఓట్లు వేసినంక ఎవ్వలు ఏం చేయట్లేదు…
– అంబటి రాజయ్య, రైతు, హుస్నాబాద్ టౌన్