దుబ్బాక, ఏప్రిల్ 20: మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ అందించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలోని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి స్వగృహంలో నియోజకవర్గంలోని 8 మండలాల ముఖ్యనాయకులతో మాజీమంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా చర్చించారు. శాసనసభ ఎన్నికల మాదిరిగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కష్టపడాలని సూచించారు. గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో పార్టీశ్రేణులను కలుపుకుని ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ అందించడమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.
ప్రజలను మోసగించిన కాంగ్రెస్,బీజేపీలకు గుణపాఠం చెప్పాలి..
రైతులను, పేదలను అష్టకష్టాలు పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు సూచించారు. గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అకాలవర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ అందించాలని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని మోసగించిందన్నారు.
ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళలు నిలదీయాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో మోసపూరిత హామీలిచ్చిన రఘునందన్‌కు దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డిని నాన్‌లోకల్ అంటున్న రఘునందన్‌రావు గతంలో పటాన్చెరులో జడ్పీటీసీగా పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. కరువు, కాటకాలకు కేరాఫ్‌గా నిలిచిన దుబ్బాకను కాళేశ్వరంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి దుబ్బాక నియోజకవర్గంలో భారీ మెజార్టీ అందిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో 25 రోజులు నా కోసం పని చేస్తే… ఐదేండ్లు మీ వెంట ఉంటూ సేవలందిస్తానని ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్, మనోహర్‌రావు, రొట్టె రాజమౌళి, సోలిపేట సతీశ్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.