మెదక్/ సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట అర్బన్, జనవరి 6: ప్రజాపాలనకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆరుగ్యారెంటీ పథకాల కోసం ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 28వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం 6వ తేదీతో ముగిసింది. ఆయా ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం సొంతూరుకు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. మెదక్ జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం వరకు మొత్తం 2,73,389 దరఖాస్తులు వచ్చాయి.
మెదక్ జిల్లా జీపీల్లో 425 బృందాలు.. మున్సిపాలిటీల్లో 55 బృందాలు…
మెదక్ జిల్లాలోని 425 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో 55 బృందాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తులను వెబ్సైట్లో నమోదు చేసేందుకు 319 మంది ప్రభుత్వ, 161 ప్రైవేట్ డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. ఈ నెల 17 వరకు దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
సిద్దిపేట జిల్లాలో 3,76,387 దరఖాస్తులు
అభయహస్తం పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో 3,76,387 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గృహజ్యోతి, పింఛన్లు, రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో 3,83,979 దరఖాస్తులు
జిల్లాలోని 647 పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లో నిర్వహించిన ప్రజాపాలనలో అధికారులు 3,83,979 దరఖాస్తులు స్వీకరించారు. అత్యధికంగా పింఛన్లు, రేషన్‌కార్డులు, మహాలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు.