గుమ్మడిదల, ఫిబ్రవరి 6: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో గురువారం నిరసనలు.ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహానగరం చెత్తను పచ్చని అడవిలో వేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు రెండోరోజు ఆందోళనలు, నిరసనలు తీవ్రతరం చేశారు. గురువారం పొద్దున్నే పొయ్యిలు కూడా రాజేయకుండా, వాకిళ్లు ఊడ్చకుండా ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. గ్రామస్తులంతా కలసి గ్రామంలో బైఠాయించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కాంగ్రెస్ సర్కారుకు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎండల్లో ఆందోళన కొనసాగాయి.
డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ముగ్గు రు యువకులు సెల్‌టవర్ ఎక్కి చస్తామంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు అక్కడి చేరుకుని ఎంత వారించినా వినిపించుకోకుండా డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు గ్రామంలోనే ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న మాజీ సర్పంచ్‌లను, మాజీ ఎంపీటీసీలను బీఆర్ఎస్ నాయకులను, యువకులను పోలీసులు అరెస్ట్ విష యం తెలిసిందే. బుధవారం పెద్దఎత్తున పోలీస్ బలగాలతో డంపింగ్ యార్డు పనులు ప్రారంభించారు.
బుధవారం రాత్రి కూడా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో జీహెచ్ఎంసీ వాహనాలతో మట్టిని తీసుకొచ్చి డంపింగ్ యార్డు పనులు చేస్తున్నారు. ఈ తంతూ చూసిన నల్లవల్లి, ప్యారానగర్ గ్రామస్తులు డంపింగ్ యార్డుతో మా గ్రామాలను వల్లకాడు చేస్తారా..? అని ఆగ్రహంతో ప్రభుత్వంపై రగిలి పోతున్నారు. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని సీఎం రేవంత్ సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా బతుకులు ఎవుసంతోనే ముడి పడ్డాయని, డంపింగ్ యార్డుతో సాగుకు యోగ్యమైన పంట పొలాలను బూడిద చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రజాపాలనను రజాకారుల పాలన చేస్తున్నారన్నారు.