జహీరాబాద్, మే 29 : జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ బైపాస్ వెళ్లే దారిలో వర్షాలు కురిస్తే ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ఈ మార్గంలో రోడ్డుతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఈ మార్గంలో వాగు తలపించే మురుగుకాల్వ ప్రవహిస్తున్నది. ప్రతిరోజు జహీరాబాద్ పట్టణంలోని పలువార్డుల మురుగు ఈ వాగు గుండా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో వర్షాలు కురిసినప్పుడు వాగు గుండా ప్రవహించే మురుగు రోడ్డుపైకి చేరి వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.
ఈ రోడ్డు గుండానే పట్టణ సమీపంలోని భరత్‌నగర్, అల్లానా ఫ్యాక్టరీ, అల్గోల్, పోట్పల్లి, ఎల్గోయి తదితర గ్రామాలతో పాటు బీదర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మూడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రూ.33 లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పట్లో టెండర్లు పూర్తికాగానే సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అప్పట్లో వర్షాకాలం ప్రారంభం నాటికి బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ బిల్లులు చెల్లింపులో జ్యాపంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పురోగతి కరువైంది.
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాల్సింది. తిరిగి వర్షాకాలం రావడంతో ఈ రోడ్డు గుంతలమయంగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. వర్షాలకు రోడ్డు చిత్తడిగా మారడంతో పాటు గుంతలతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి అసంపూర్తిగా పనులు పూర్తిచేయించాలని వాహనదారులు కోరుతున్నారు.